రుణాలపై పొరుగు రాష్ట్రాలేం చేస్తున్నాయి..? : కేసీఆర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రుణాలపై కేంద్రం ఆంక్షల గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో మంచి పనితీరు కనబర్చుతున్నా రుణాల సేకరణకు ఆంక్షలు పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు తెలంగాణ కొత్తగా రూ.10 వేల కోట్ల రుణాలు పొందేందుకు ఆంక్షల్లో సడలింపు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత కనబర్చినట్లు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాళేశ్వరం ఎత్తిపోతల సంస్థకు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) పెట్టిన షరతులపై బుధవారం చర్చించారు. ఆ సంస్థలు పెడుతున్న కొత్త షరతులపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర మార్గాల్లో తీసుకునే అప్పులకు అడ్డుగా మారుతున్న కేంద్ర నిర్ణయాలపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రుణాల సేకరణకు కేంద్రం అనుసరిస్తున్న బాటలోనే రాష్ట్రమూ వెళ్లేందుకు వీలుందా అనే అంశాన్నీ పరిశీలించాలని సూచించారు.

తెలంగాణపై విధించిన రుణ ఆంక్షల్లో కొంతమేరకు సడలింపులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపినట్లు తెలిసింది. రాష్ట్రంలో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొత్తగా మరో రూ.10వేల కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news