తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జడ్చర్లలో తలపెట్టిన బహిరంగ సభకు హాజరైన ప్రసంగించారు. పాలమూరు ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏమూలకు పోయినా దుఃఖంతో నిండిపోయేదని, మహబూబ్‌నగర్ నీటిగోసపై ఉద్యమ సమయంలో నేను పాట రాశానన్నారు. అప్పట్లో మనుషులే కాదు, అడవులు కూడా బక్కపడ్డాయని, 9 ఏళ్ల పోరాటం తర్వాత అనుమతులు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్.
గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెల్లో బాధ కలిగేది అని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా పక్కనే పారుతున్నా.. ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏం లాభం జరగలేదు. ఉద్యమంలో నేనే పాట రాసినా.. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలు ఎండే అని పాట కూడా రాశాను. మీ అందరికి తెలుసు. మహబూబ్‌బ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దుఃఖం, బాధ పేదరికం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి మంత్రి అయ్యారు. చాలా పనులు చేశారు. ఇవాళ రాష్ట్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఆయన పుణ్యమే అని కేసీఆర్ తెలిపారు.