తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఆ తర్వాత….ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు కేసీఆర్. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలుల రైతులకు కడగళ్లు మిగిల్చాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనగా.. వడగళ్ల వానకు పంటంతా నేలమట్టమైంది. కొన్ని ప్రాంతాల్లో పంట నీటిలో తడిసిముద్దయింది. అకాల వర్షంతో రాష్ట్రంలోని రైతులు బాగా నష్టపోయారు. ఈ క్రమంలో పంట నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం రోజున నివేదిక సమర్పించారు. ఈ తరుణంలోనే.. జిల్లాల పర్యటనకు సిద్ధం అయ్యారు సీఎం కేసీఆర్.