175 కి 175 సీట్లు గెలిచే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని వైసీపీ కార్యకర్తలకు, నేతలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నామని.. కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని, ఎప్పటినుంచో చంద్రబాబుగారికి మద్దతుగానే ఉందని బయట ప్రపంచం అంతా అనుకుంటారని వెల్లడించారు. వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం అని తెలిపారు.
చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగిందని ఆయన వెల్లడించారు. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.