తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న సీఎం కేసీఆర్‌కు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సిద్దిపేటలో నిర్వహించిన మోడీ ఎనిమిదేళ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెరాస నేతలపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాగా, ఇటీవల ప్రధాని మోడీ పరిపాలన ఎనిమిదేళ్ల పూర్తి చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నేను తెరాస పార్టీ నుంచి మారలేదని, టీఆర్ఎస్ నేతలే పార్టీ నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. పదవుల కోసం నోళ్లు మూసే దద్దమ్మలు తెరాస నేతలని మండిపడ్డారు. కేసీఆర్‌కు గోళీలు ఇచ్చేందుకే సంతోష్ కుమార్‌కు ఎంపీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. హైదరాబాద్‌లో విష సంస్కృతిని పెరుగుతోందని, రాష్ట్రంలో బెల్టు షాపుల సంఖ్యను ఎందుకు పెంచుతున్నారో చెప్పాలన్నారు.