భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఏఐసీసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి భట్టి పాల్గొని.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు రాజ్యాంగ పరంగా ఏర్పాటైన భారత పార్లమెంట్ లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వెంటనే బర్తరఫ్ చేయాలని, అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. అంబేద్కర్ పట్ల, రాజ్యాంగం పట్ల బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకత వైఖరినీ ప్రదర్శిస్తుందని ఆరోపించారు. దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను విమర్శించడాన్ని ప్రజలంతా ఖండించాలన్నారు.