ఆ వైసీపీ ఎమ్మెల్యేపై కంప్లెంట్లే కంప్లెంట్లు…!

-

ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీలో రోజురోజుకు పంచాయితీలు పెరిగిపోతున్నాయి. మంత్రులు – ఎమ్మెల్యేలు, మంత్రులు – ఎంపీలు, ఎంపీలు – ఎమ్మెల్యేలకు మధ్య ఏ మాత్రం పొస‌గ‌టం లేదు. చివరకు వీరిలో ఒకరిపై మరొకరు అధిష్టానానికి కంప్లెంట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే వీరి మధ్య వార్ ఏ స్థాయిలో ముదురు పోయిందో అర్థం అవుతోంది. మ‌రి కొంద‌రు నేతలు అయితే సొంత పార్టీ నేత‌ల ఫోన్ల‌పైనే నిఘా పెడుతున్నారు. చివ‌ర‌కు ఈ విష‌యంలో అధిష్టానం ‌సైతం ఏం చేయ‌లేని ప‌రిస్థితి. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు విజయవాడ వచ్చి పలువురు రాష్ట్ర నేతలతోపాటు మంత్రులకు ఫిర్యాదు చేయటం అధికార పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది.

ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ పార్టీ పగ్గాలను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి చూసేవారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పడంతో జగన్ సీటు పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్న మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయ‌న‌ ఎన్నికల్లో గెలిచిన వెంటనే పార్టీకోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి తన అనుచరులతో రాజకీయం చేస్తున్నారని… టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి పనులు చేస్తున్నారు అంటూ వైసీపీ కేడర్ గ‌గ్గోలు పెడుతోంది.

ఈ క్రమంలోనే వేణుగోపాల్ తీరుతో పార్టీ ఘోరంగా నష్టపోతుందని దర్శి వైసీపీ నేత‌లు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విజ‌య‌వాడ వ‌చ్చి మ‌రీ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వేణుగోపాల్ తీరులో మార్పు రాలేదని వారు వాపోతున్నారు. అయితే వైసీపీ మంత్రులు బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ వారికి సర్ది చెప్పి పంపించారు.

అయితే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం మాత్రం ఈ ఫిర్యాదులు వెనక మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హస్తం ఉందని.. గత ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడిన శివప్రసాద్రెడ్డి ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి ప్రయత్నాలు చేయటం కరెక్ట్ కాదని వాదిస్తోంది. ఏదేమైనా ఇద్దరు కీలక నేతల మధ్య వార్‌తో దర్శి వైసీపీ రాజకీయం వేడెక్కుతోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news