ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం మంగళవారం కనువిందు చేసింది. ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం పలు ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే చాలా ఏండ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ కనిపించదట.
హైదరాబాద్‌లో సాయంత్రం 4.59 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభం కాగా.. ఢిల్లీలో సాయంత్రం 4.29 గంటలకు, కోల్‌కతాలో సాయంత్రం 4.52 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, ముంబైలో 4.49 గంటలకు, ద్వారకలో 4.36 గంటలకు, తిరువనంతపురంలో 5.29 గంటలకు, నాగ్‌పూర్‌లో 4.49 గంటలకు గ్రహణం మొదలైంది. గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో పలువురు ప్రత్యేక పరికరాల సాయంతో వీక్షించారు. సూర్య గ్రహణం 1.45 గంటల పాటు సాగింది.