ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మా త్రమే ఈ పార్టీకి దక్కారు. కొన్ని జిల్లాల్లో అసలు బోణీ కూడా కొట్టలేదు. అలాంటి పార్టీ కేవలం రెండంటే రెండు జిల్లాల్లో మాత్రం నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రకాశం నుంచి గొట్టిపాటి రవి, కరణం బలరాం, డోలా బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు.. వైసీపీ సునామీని తట్టుకుని మరీ విజ యం సాధించారు. ఇక, విశాఖలోనూ రూరల్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నగరంలోని నాలుగు నియోజక వర్గాల్లో మాత్రం టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.
గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ టీడీపీ టికెట్లపై విజయం సాధిం చారు. మొత్తంగా కీలకమైన ఈ రెండు జిల్లాల్లోనూ జగన్ సునామీలో కూడా పార్టీ గెలుపు గుర్రం ఎక్కడం సంచలనమనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యే పరిస్తితి ఎలా ఉంది? పార్టీని ఏ విధం గా ముందుకు తీసుకువెళ్తున్నారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తే.. చాలా చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. ఏకంగా ఒక ఎమ్మెల్యే పార్టీకి దూరమయ్యారు. మిగిలిన వారిలో ఒక్కరు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన ఇద్దరు సైలెంట్ అయ్యారు.
దీంతో ప్రకాశంలో గెలిచిన ఆ నలుగురు నాలుగు విధాల వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక, విశాఖ విషయానికి వస్తే.. ఇక్కడ నగరంలోని నాలుగు నియజకవర్గాల్లోనూ టీడీపీ సైకిల్ రయ్యన దూసుకుపోయింది. అయితే.. ఇక్కడ ఎవరూ పార్టీలు మారిపోయే పరిస్థితి ఇప్పట్లో కనిపించకపోయినా.. పార్టీని నిలబెట్టుకునే వ్యూమం మాత్రం వీరికి కనిపించడం లేదు. పైగా ఎవరికి వారే యమునా తీరే అన్నవిధంగా ఉంది. అధికార పార్టీకి, ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యానించే వారుకొందరైతే.. పార్టీ పరువును బజారున పడేసేలా వ్యవహరించే నాయకులు ఒకరిద్దరు ఇక్కడ ఉన్నారు.
చేస్తే.. అతి.. లేదంటే.. మౌనం అనేలా ఉన్న గంటా వంటి నేత కారణంగా కూడా పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ రెండు జిల్లాల్లోనూ టీడీపీ సాధించిన విజయం.. కేవలం ఏడాది తిరిగే సరికి మటుమాయం అయినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. దీంతో చంద్రబాబు.. వీరిని నమ్మలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ పరిణామం.. స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపు తోంది.ఇక, ఈ నెల ఆఖరులో నిర్వహించనున్న మహానాడుపైనా దీని ప్రభావం ఉంటుందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.