నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుంగపాడులో ఏర్పాటు చేసిన బీజేపీలో చేరికల కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ సమయంలో దగ్గరలోని వినాయక మండపం వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డికి సంబంధించిన పాటను పెట్టారు. దీంతో భాజపా కార్యకర్తలు ఆ పాటను నిలిపివేయాలని వారితో గొడవకు దిగారు.
ఈ క్రమంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు గొడవకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు కలగజేసుకుని సర్దిచెప్పడంతో కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డిని చాలా సార్లు విమర్శించారు. ఈ క్రమంలో రేవంత్ పాట స్థానికంగా దుమారం రేపింది.