రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు పక్కకెళ్లారు?.. ఏం మాట్లాడుకున్నారు?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితర నాయకులు కూడా ఉన్నారు. ఈ సమయంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య చిట్ చాట్ జరిగింది. మిగిలిన కాంగ్రెస్ నేతల నుంచి పక్కకెళ్లి మరీ వీళ్లద్దరూ మాట్లాడుకున్నారు. రేవంత్ రెడ్డిని కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పక్కకు తీసుకెళ్లారు. దీంతో రాజకీయ నాయకుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు వీళ్లు ఎందుకు పక్కకు వెళ్లారు… ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు తెలియాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు.

కాగా త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌ని మారుస్తారని చర్చ జరుగుతోంది. టీపీసీసీ రేస్‌లో ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి ఉన్నారని సమాచారం. మరోవైపు బీసీలకు టీపీసీసీ అవకాశం ఇవ్వాలని వీ హన్మంతరావు కోరుతున్నారు. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.

ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యే పోటీ నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నానని తెలిపారు. తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి మళ్లీ కాంగ్రెస్‌కు పునర్ వైభవం తీసుకొస్తానని తెలిపారు. జగ్గారెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి చర్చించుకోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరిలో ఒకరికి కన్‌ఫామ్ అని తెలిసిందా?. అందుకే పక్కకెళ్లి మాట్లాడుకున్నారా? అనే దానిపై స్పష్టత ఇస్తారేమో చూడాలి.