ఊబర్‌కు షాక్.. 20వేల జరిమానా విధించిన ముంబయి కోర్టు

-

ముంబయి కన్జ్యూమర్ కోర్టు ఊబర్‌కు షాక్ ఇచ్చింది. క్యాబ్‌ డ్రైవర్‌ ఆలస్యంగా రావడం వల్ల విమానం మిస్సైనట్లు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కోర్టు.. ఊబర్‌ ఇండియా సంస్థకు 20 వేల జరిమానా విధించింది. డోంబివ్లికి చెందిన అడ్వకేట్‌ కవితా శర్మ 2018 నుంచి ఈ కేసులో పోరాటం చేస్తోంది. ఆ ఏడాది జూన్‌లో చెన్నైకి ఆమె ఫ్లయిట్‌ బుక్‌ చేసుకుంది. అయితే క్యాబ్‌ డ్రైవర్‌ ఆలస్యంగా రావడమే కాకుండా.. విమానాశ్రయానికి రాంగ్‌ రూట్లో వెళ్లాడు.

ఫోన్‌ కాల్‌ మాట్లాడుతున్న ఆ డ్రైవర్‌ రాంగ్‌ టర్న్‌ తీసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. దాని వల్ల సుమారు 20 నిమిషాలు ఆలస్యమైందన్నారు. విమానాశ్రయానికి చేరుకొనే సమయానికి ఆమె ఎక్కాల్సిన ఫ్లయిట్‌ మిస్సైంది. బుకింగ్ టైమ్‌లో చూపించిన బిల్లు కన్నా ఎక్కువే ఆమె నుంచి వసూల్‌ చేశారు.

ఈ కేసులో ముంబయి అడ్వకేట్‌ తొలుత లీగల్ నోటీసులు జారీ చేశారు. కానీ ఊబర్‌ ఇండియా స్పందించలేదు. దీంతో ఆమె థానే జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన వినియోగదారుల కోర్టు అడ్వకేట్ శర్మకు 20 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news