కరోనా మహమ్మారి వచ్చిన పండగలన్నీ సాధారణ రోజుల్లా మారిపోయాయి. ఏ పండగ కూడా మునుపటిలా జరగట్లేదు. కరోనా నియమాలు, మూడవ వేవ్ పట్ల భయం, ఏం చేస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజలని పండగని ఆనందంగా జరుపుకోనివ్వకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండగకి ఇలాంటి ఆటంకమే వచ్చింది. నెల్లూరు జిల్లాలో జరిగే ఈ పండగకు కరోనా ప్రభావం తగిలింది.
గుంపులుగా గుమిగూడడం వల్ల కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున దర్గామిట్టాలో జరిగే రొట్టెల పండగను రద్దు చేస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సీఎస్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ విషయమై అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసారు. గుంపులుగా వచ్చే జనాన్ని ఆపే అవకాశం ఉండదని, అందుకే ముందుగా హెచ్చరించాలన్న ఉద్దేశ్యంతో రొట్టెల పండగను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని జనం మాట్లాడుకుంటున్నారు.