ప్రపంచ వ్యాప్తంగా అవయవదాన దినోత్సవాన్ని ఆగస్టు 13వ తేదీన జరుపుకుంటారు. అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి, అవయవ దానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా పిలుపు ఇచ్చేందుకు ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటారు.
అవయవ దానం వల్ల ఒక్క మనిషి 8జీవితాలను నిలబెట్టవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, చేతులు, ముఖం, కళ్ళు, ఎముక మూలుగ, కణాలు దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడడమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది.
ఎవరెవరు అవయవదానం చేయవచ్చు
ఎవ్వరైనా ఏ వయస్సు వారైనా అవయవ దానం చేయవచ్చు. 18సంవత్సరాల లోపు వారు అవయవ దానం చేయాలనుకుంటే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి.
అవయవదానం చరిత్ర
మొట్టమొదటి సారిగా 1954లో రోనాల్డ్ హెర్రిక్ అనే వ్యక్తి, తన సోదరుడికి కిడ్నీ దానం చేసారు. ఈ ఆపరేషన్ ని డాక్టర్ ముర్రే నిర్వహించారు. అవయవ దానంతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినందుకు 1990లో నోబెల్ బహుమతి వచ్చింది.
2015లో అప్పుడే పుట్టిన పాపాయి కిడ్నీలు దీర్ఘకాల కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి దానం చేసారు. అలాగే ఎక్కువ వయసు ఉండి అవయవాలు దానం చేసిన వారిలో 107ఏళ్ళ మహిళ చరిత్రకెక్కింది. స్కాట్లండు చెందిన ఈ మహిళ తన మరణం తర్వాత కళ్ళని దానం చేసింది.
ఇండియాలో అవయవ దానం
ఇండియాలో అవయవ దానం చేయడానికి చాలామంది వెనక్కి తగ్గుతారు. మొత్తం మీద 0.01శాతం మంది మాత్రమే అవయవ దానం చేయడానికి వస్తున్నారని సమాచారం.