కరోనా, ఓమిక్రాన్ కారణంగా మూాతపడిన విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. గత రెండేళ్లుగా కరోనా ప్రజలపై పగపట్టింది. రెండేళ్లుగా కరోనా, లాక్ డౌన్ కారణంగా విద్యాలయాలు మూతపడ్డాయి. దీంతో చదువులు అటకెక్కాయి. కేవలం ఆన్ లైన్ విధానంలోనే ఎక్కువగా క్లాసులు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా డిసెంబర్ లో దేశంలో ఓమిక్రాన్ కేసులు తీవ్రత పెరగడంతో మరోసారి పలు రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. థర్డ్ వేవ్ కారణంగా స్కూళ్లు మూతపడ్డాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మరణాల సంఖ్య అదుపులో ఉండటంతో మళ్లీ స్కూళ్లు తెరుచుకుంటున్నాయి.
నేడు త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బడులు తిరిగి ప్రారంభం అయ్యాయి. రేపటి నుంచి తెలంగాణ, తమిళనాడు, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా ప్రోటోకాల్స్ ప్రకారమే విద్యార్థులు స్కూళ్లకు హాజరుకానున్నారు. దీంతో పాటు క్లాసు రూమ్ లో మాస్కులు, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.