కరోనా ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులు మొదలు.. వీవీఐపీలు, ముఖ్య నేతలు అందరూ వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే కాదు… ముఖ్యమంత్రుల్ని కూడా వైరస్ ఎటాక్ చేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మాజీ ప్రధాని మన్మోహన్ వంటి నేతలకు పాజిటివ్ నిర్ధారణ కావడం.. రాజకీయవర్గాల్లో కలవరం రేపుతోంది..తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా ఎవరిని కరోనా వదలడం లేదు.
కరోనా సెకెండ్ వేవ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో టెర్రర్ సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రజలతో సంబంధం ఉన్న నేతలను కరోనా విడిచిపెట్టడంలేదు. ఎమ్మెల్యేలు మొదలు ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానుల వరకూ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొవిడ్ బారిన పడగా… ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి. తొమ్మిది రోజుల పాటు కేసీఆర్ ఐసోలేషన్‌లో ఉంటారు.
దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వైరస్ బారిన పడ్డారు. కర్నాటక సీఎం యడ్యూరప్పకు ఏకంగా రెండు సార్లు వైరస్ సోకింది. ఆ మధ్య వైరస్ బారినపడి కోలుకున్న యడ్యూరప్పకు.. సెకండ్ వేవ్‌లో మరోసారి సోకింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వైరస్ సోకింది. ఏప్రిల్ 7న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 8న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పాజిటివ్‌గా తేలింది.
ఇక ఉత్తర్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులిద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 11 నుంచి హోం ఐసోలేషన్‌లో వున్నారు. యుపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు ఏప్రిల్ 12న కరోనా సోకడంతో ఆయన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. గతేడాది జులై 25న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కరోనా సోకింది. సెప్టెంబర్ 2న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో వుంచి చికిత్స అందించారు. డిసెంబర్ 12న ఉత్తరాంఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు వైరస్ సోకడంతో ఐసోలేషన్ లో చికిత్స పొందారు.
తాజాగా కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా వైరస్ సోకింది. మన్మోహన్ కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో వయసు రిత్యా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మన్మోహన్‌కు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.