కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి కదా అని చెప్పి ప్రస్తుతం చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. మాస్కులు ధరించడం లేదు, సోషల్ డిస్టన్స్ పాటించడం లేదు. అయితే కరోనా పూర్తిగా మన జీవితాల నుంచి తొలగిపోయింది అనుకునే వరకు ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే. ఇక హాస్పిటళ్లలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. అవును.. ఎందుకంటే హాస్పిటళ్లలో గాలిలోనూ కరోనా వైరస్ ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ), చండీగడ్‌లోని ఐఎంటీ తదితర కొన్ని కోవిడ్ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్లు ఉన్న వార్డుల్లో అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఆ వైరస్ పేషెంట్ల వార్డుల నుంచి 2 మీటర్లకు పైగా దూరం వరకు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అధ్యయనం చేసి తాజాగా వివరాలను వెల్లడించారు.
అందువల్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అలాంటి చోట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కరోనా కేసులు తగ్గుతుతున్నాయి అని చెప్పి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ గాలిలో కరోనా ఉన్నట్లు తెలుస్తుంది కనుక పౌరులు కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.