మధ్యప్రదేశ్ చేనేత కళాకారులు ఓ అద్భుతం సృష్టించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో సొగసరి చీరలకు అదనపు సొబగులను అద్దారు. ఔషధగుణాలను పొదువుతూ తీర్చిదిద్దిన ఆ చీరలను ధరిస్తే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయట. సుగంధ భరితమై ఈ ఔషధ చీరలు దేశంలోని పలు ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
sareeఔషధ చీరలు ధరించినవారి చర్మం ద్వారా వ్యాధినిరోధక శక్తి అందుతుందని ఆయుర్వేద నిపుణులు అంగీకరిస్తున్నారు. ఆయుర్వేదంలోని ప్రత్యేక ఔషధ గుణాలు ఈ చీరల్లో స్పష్టమవుతున్నాయని, ఆరోగ్య రక్షణకు ఇవి దోహదపడతాయని భోపాల్‌లోని పండిత్ కుషి లాల్ శర్మ ఆయుర్వేద కళాశాల విభాగాధిపతి డాక్టర్ నితిన్ మార్వా తెలిపారు.
మధ్యప్రదేశ్ చేనేతలు, హస్తకళల డైరెక్టరేట్ అధికారుల సలహాతో చేనేత కార్మికులు ఔషధ చీరలను రూపొందించారు. వందల ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానం ఆధారంగా సాధారణ చేనేత చీరకు పలు దశల్లో ఆయుర్వేద గుణాలను పొందుపరుచుతారు. సుగంధ మూలికలను 48 గంటల పాటు నీటిలో నానబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకూ దశలవారీగా పట్టిస్తారు. ప్రత్యేక నైపుణ్యంతో అత్యంత జాగ్రత్తగా చేసే ఈ ప్రక్రియలో ఒక్కో చీర తయారీకి 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది.