స్వచ్ఛ సర్వేక్షన్ 2020 అవార్డును గురువారం ప్రకటించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ మరోసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవార్డును సొంతం చేసుకుంది. దీంతో ఇండోర్ వరుసగా 4వ సారి దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా ఆవిర్భవించింది. ఈ మేరకు కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫెయిర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులను ప్రకటించారు. స్వచ్ఛ మహోత్సవ్ పేరిట ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డులను ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ వరుసగా 4వ సారి దేశంలోనే అత్యంత క్లీనెస్ట్ సిటీగా ఆవిర్భవించడం సంతోషంగా ఉందని, అందుకు కృషి చేసిన అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నానని మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. అలాగే గుజరాత్‌లోని సూరత్ రెండో క్లీనెస్ట్ సిటీగా నిలవగా, నవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యంత క్లీనెస్ట్ కంటోన్మెంట్‌గా నిలిచిన జలంధర్ కంటోన్మెంట్‌కు స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ 2020 అవార్డును ప్రకటించారు.
కాగా గంగానది పరివాహక ప్రాంతంలో ఉన్న శుభ్రమైన నగరాల్లో వారణాసిని క్లీనెస్ట్ సిటీగా ప్రకటించారు. 2016లో ప్రధాని మోదీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఆ ఏడాది మైసూరు ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుంచి 2017, 2018, 2019లలో వరుసగా 3 సార్లు ఇండోర్ సిటీ క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే సిటీ 4వ సారి ఆ అవార్డును సొంతం చేసుకుంది. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ను దేశంలోని 4242 సిటీల్లో నిర్వహిస్తున్నారు. అక్కడి ప్రజలను సర్వే చేసి ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు.