కరోనా దాడితో.. రాజకీయాలు పక్కకు పోయాయి..!

-

ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. పలు చోట్ల రాజకీయ నాయకులు తమ భేషజాలు పక్కకు పెట్టేలా చేసింది. అధికార పార్టీనా, ప్రతిపక్షంలో ఉన్నామా అనేది లేకుండా నాయకులు ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడటానికి తమ వంతు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో మండల, జిల్లా స్థాయిలోని నేతలు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి తోచిన విధంగా వారు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా స్వాగతిస్తున్నారు.

కేరళలో ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాలా కలిసి సంయుక్తంగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. నిధుల విషయంలో కేంద్రం తమకు అన్యాయం చేసిందని పల్లుమార్లు బల్లగుద్ది చెప్పిన కేసీఆర్‌ కూడా.. కరోనా కట్టడికి కేంద్రం తీసకుంటున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కరోనా నివారణకు కేంద్రం, ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెబుతున్నారు.

సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా కేంద్రం తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కరోనా సమయంలో సంయమనంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆదివారం రోజున రాత్రి తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని పిలుపుపై.. టీఎంసీ నాయకులు తీవ్రస్థాయితో విమర్శలు గుప్పించారు. అయితే మమతా బెనర్జీ మాత్రం వీటిపై అచితూచి స్పందించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రధాని వ్యవహారాల్లో నేనేందుకు తలదూర్చాలి అని ప్రశ్నించారు. తను కరోరాను ఎలా జయించాలని చూస్తున్నానని.. రాజకీయ పోరు గురించి ఆలోచించడం లేదని తెలిపారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా పోరాటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని మాయావతి బీఎస్పీ ఎమ్మెల్యేలు పనిచేయాలని ఆదేశించాలని ఆదేశించారు. దీంతో ఆమెకు యోగికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా కరోనా కట్టడి విషయంలో.. మొదట్లో కేంద్రం తీరును తప్పుబట్టినప్పటకీ ఆ తర్వాత కేంద్రం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. అయితే వలసకూలీలు లాక్‌డౌన్‌ వేళ తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో.. మందుస్తు ప్రణాళికలు లేకుండా మోదీ తీసుకున్న నిర్ణయం.. పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు పడేలా చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news