ఇప్పటి వరకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించకపోయినా.. దేశంలో లాక్‌డౌన్ మరో పదిహేను రోజులు ఖచ్చితంగా అమ లయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కరోనా దేశంలో ఇప్పుడు తీవ్రస్థాయిలో విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. దీనికితోడు పాజిటివ్ కేసులు కూడా ఆరు వేలకు పైబడి నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లోనే ఇవి పది వేల పైచిలుకు దాటే అవకాశం ఉందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక, ఏపీ, తెలంగాణలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీలేదు. ఇప్పటికే ఒడిసా, పంజాబ్ వంటి రాష్ట్రాలు స్వయంగా లాక్‌డౌన్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి.
ఈ నేపథ్యంలో దేశంలో ఎట్‌లీస్ట్ మరో పదిహేను రోజులు లాక్‌డౌన్ కొనసాగే అవకాశం మెండుగానే కనిపిస్తోంది. మరి దీనివల్ల దేశానికి వచ్చే ఇబ్బంది ఏంటి? ప‌్రజలకు ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే చర్చ కీలకంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా అనేక పరిశ్రమల్లో పనులు ఆగిపోయాయి. కంపెనీలు మూతబడ్డాయి. దీంతో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అనేక మంది వలస కార్మికులకు కూడా ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఆర్థికంగా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అగ్రరాజ్యంగా చెప్పుకొనే అమెరికాలోనే కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారనుందని వస్తున్నవార్తలు.. భారత్‌ను మరింత భయపెడుతున్నాయి. ఇక్కడ ఆర్థిక పరిస్థితి గడిచిన ఆరుమాసాలుగా ఏమీ బాగోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. వివిధ రాష్ట్రాలు ఆర్ధికంగా సాయం చేసినా.. అవి పేద వర్గాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఊరటా లభించలేదు. కేంద్రం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ.. దీనిలో మధ్యతరగతి వర్గాలకు చేరింది ఏమీలేదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత పరిస్థితి గతానికి భిన్నంగా ఉంటుందనే ది విశ్లేషకుల మాట.
ఇదే విషయాన్ని సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా చెప్పుకొచ్చారు. దీనిని బట్టి నిత్యావసర ధరలు సహా పెట్రో ధరలు కూడా ఆకాశాన్ని తాకే అవకాశం మెండుగా ఉంది. పరిస్థితిని గమనిస్తే.. ఇప్పుడున్నవిధంగా వచ్చే రోజులు ఉండబోవన్నది వాస్తవం. ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటి నుంచే ప్రజలు తమ ఖర్చులను జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు. మరి కరోనా కట్టడికి మనం ఆమాత్రం చేయకతప్పదేమో!!