రెండేళ్లగా వైరస్ భీభత్సం సృష్టిస్తుంది. ఒకదాని తర్వతా ఒకటి వ్యాప్తిస్తూ..యావత ప్రపంచాన్నే వణికించింది. వైరస్ భారిన పడనివారంటూ ఉండరేమో అన్నట్లు ఈ వైరస్ మానవాళితో ఆడుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోయాం… కానీ కొవిడ్-19 అడుగుపెట్టని దేశాలు ఇంకా ఉన్నాయని మీకు తెలుసా.. ఆ దేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదట. డబ్ల్యూహెచ్‌వో తొలుత ఏడు దేశాలని ప్రకటించినా తాజాగా ఒక ద్వీప దేశంలో పెద్దఎత్తున కేసులు రావడంతో.. తొలిసారి లాక్‌డౌన్ కూడా విధించారు. ఇక ఆ మిగిలిన ఆరు దేశాలంటే చూద్దాం..
కుక్ ఐలాండ్స్..
దాదాపు 17 వేల జనాభా కలిగిన కుక్ ఐలాండ్స్‌లోనూ రెండేళ్లుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాల్లో కుక్ ఐలాండ్స్ కూడా ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంలో అర్హులైనవారిలో దాదాపు 97 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలోనే ఈ దేశం ఇతర దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ఇటీవలే జనవరి 13 నుంచి న్యూజిలాండ్‌తో క్వారంటైన్ రహిత ప్రయాణాలను పునఃప్రారంభించింది. అయితే, రెండేళ్లుగా ఒక్క కేసు నమోదు కాని ఈ దేశంలో తాజాగా తొలి కేసు నమోదు కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేయడంతో ఆ తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఉత్తర కొరియా
ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు..ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఇప్పటికీ ఉత్తర కొరియా దేశంలోకి పర్యాటకులను అనుమతించట్లేదు. ఇతర దేశాల నుంచి ఉత్పత్తుల దిగుమతిని నిలిపివేసింది. వ్యాక్సిన్ డోసులను కూడా దిగుమతి చేసుకోకుండా ఉత్తర కొరియా తిరస్కరిస్తూనే వస్తోంది. కఠిన ఆంక్షల మధ్య వ్యాక్సిన్/బిజినెస్ సర్టిఫికెట్ ప్రాతిపదికన దేశాల మధ్య ప్రయాణాలను తాజాగా తిరిగి ప్రారంభించినట్లు అక్కడి మీడియా కథనాల ద్వారా తెలిసింది.
తుర్కెమెనిస్థాన్..
మధ్య ఆసియా దేశాల్లో ఒకటైన తుర్కెమెనిస్థాన్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ దేశం కాస్పియన్ సముద్రం, కరక్కమ్ ఎడారి సరిహద్దులుగా కలిగి ఉంది. కరోనా ప్రారంభ దశ నుంచి తుర్కెమెనిస్థాన్‌లోని అధికార ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కరోనాను కట్టడికి చేస్తోంది. విదేశాలకు వెళ్లే విమానాలను తప్ప అన్నీ సరిహద్దులను మూసివేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్, రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకుంటేనే అనుమతి… ఆ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రారంభంలోనే ఆదేశించింది. ఈ విధంగా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ కరోనా రహిత దేశంగా నిలిచింది.
టేకెలావ్..
హవాయి, న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న చిన్న చిన్న ద్వీపాల సమూహమే టేకెలావ్. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరు గాంచింది. టేకెలావ్‌లో దాదాపు 68.6 శాతం జనాభాకు రెండు డోసుల టీకాను అందించింది.
నౌరు..
ఆస్ట్రేలియాకు ఈశాన్య ప్రాంతంలో మైక్రోనేషియాలో ఉన్న అతి చిన్న ద్వీప దేశం నౌరు. ఈ దేశ మొత్తం జనాభా 10,834 మంది మాత్రమే. 2021లోనే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసి.. 100 శాతం వ్యాక్సినేషన్ అందించిన దేశాల జాబితాలో నౌరు నిలిచింది. గతేడాది డిసెంబరు 31 నుంచి రెండు డోసుల టీకా తీసుకున్న సందర్శకులను మాత్రమే ఇక్కడి అనుమతిస్తుంది..
తువాలు..
దక్షిణ పసిఫిక్‌లో ఉన్న తువాలు ద్వీప దేశంలోనూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదట.. కరోనా ప్రారంభ దశలోనే కఠినమైన ఆంక్షలు విధించించి.. సరిహద్దులను పూర్తిగా మూసివేసి, ప్రయాణాలను నిషేధించింది. ఏప్రిల్ 2021లో పెద్దఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. కరోనాను దేశంలో అడుగుపెట్టనీయకుండా వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
ఇవేకాకుండా మధ్య పసిఫిక్‌లోని కిరిబిటీ ద్వీప దేశంలోనూ మొన్నటి వరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. కానీ, తాజాగా (జనవరి 23న) విదేశాల నుంచి ఈ దేశంలో అడుగుపెట్టిన వారిలో (36 మందికి) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తొలిసారి ఈ దేశంలో లాక్‌డౌన్ కూడా విధించింది అక్కడి ప్రభుత్వం.
– Triveni Buskarowthu