హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌కు అమెరికాలో అనుమతి లభించలేదు. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే భారత్‌తో సహా పలు ఇతర దేశాల్లోనూ పంపిణీ చేస్తున్నారు. అయితే అమెరికాలో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయగా అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో అమెరికాలో కోవాగ్జిన్ లభించేందుకు మరింత ఆలస్యం కానుంది.
భారత్ బయోటెక్ నిజానికి మన దేశంలో నిర్వహించిన ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ డేటాను ఇంకా బయటకు విడుదల చేయలేదు. అయినప్పటికీ కోవాగ్జిన్‌కు మన దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. అయితే రేపు, మాపు అంటూ ఆ కంపెనీ కాలయాపన చేస్తూ వచ్చింది. ఇక అమెరికాలో తమ వ్యాపార భాగస్వామి అయిన ఆక్యుజెన్ సంస్థతో ఎఫ్‌డీఏకు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసింది. కానీ కేవలం పాక్షిక డేటాను మాత్రమే సమర్పించింది. దీంతో ఎఫ్డీఏ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వలేదు. ఈ వ్యాగ్జిన్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌కు చెందిన మరింత డేటాను సమర్పించాలని ఎఫ్‌డీఏ సూచించింది.
కాగా జూలై నెలలో కోవాగ్జిన్‌కు చెందిన ఫేజ్ 3 ట్రయల్స్ డేటాను ప్రచురిస్తామని భారత్ బయోటెక్ ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు ఫేజ్ 4 ట్రయల్స్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పూర్తి డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించి లైసెన్స్ తీసుకుంటామని కూడా తెలియజేసింది. అయితే కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులను వ్యాక్సిన్ తీసుకోనట్లుగానే అమెరికా పరిగణిస్తుండడం గమనార్హం. మరి వారి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.