దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మరో 15 రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ తెలిపారు. కోవిడ్ సెకండ్‌వేవ్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదన్నారు.
కరోనా సెకండ్ వేవ్ మే 7వ తేదీ వరకు తీవ్రస్థాయికి చేరుకుంటుందని నిపుణులు ముందుగా అంచనా వేశారు. కానీ అందుకు ఇంకో 15 రోజులు పడుతుందని తాజాగా తెలిపారు. అందువల్ల మరో 15 రోజుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ పీక్ దశకు వెళ్తుందని తెలిపారు. అప్పుడు రోజుకు ఎన్ని కరోనా కేసులు వస్తాయో ఊహించి చెప్పలేమన్నారు. గత కొద్ది రోజులుగా రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కానీ అది ఇప్పుడు 4 లక్షలకు పైగానే చేరుకుంది. దీంతో రానున్న 15 రోజుల్లో ఇది రెట్టింపు కావచ్చేని అభిప్రాయ పడుతున్నారు.
అయితే కరోనా మూడో వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ కోవిడ్ రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపింది. కచ్చితంగా 3 పొరల మాస్కులను ధరించాలని చెబుతూనే హోమ్ ఐసొలేషన్‌లో చికిత్స తీసుకునే వారికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తారా, లేదా అన్న విషయం ఉత్కంఠగా మారింది.