పవన్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు…జనసేనానిలో రాజకీయ స్పష్టత లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్ చేశారు. వైసిపి వ్యతిరేక ఓటును చీల్చును అన్నా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నానని.. బిజెపి ఎలా వైసిపికి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ ఇస్తుందని వెల్లడించారు. వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్ లో ఉన్నాయని.. వారి సహజీవనం మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తారో అర్థం కావడం లేదని చెప్పారు.
వైసీపీ నాయకులు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ ఏపీకి వచ్చి శివతాండవమాడుతున్నారని.. దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం ముఖ్యం అని చెప్పారు. బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేనలు మాటెత్తకపోవడం బాధాకరమని.. దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం బాగా తగ్గిపోయిందని వెల్లడించారు.
మేము బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు మా దగ్గరకు వచ్చినవేనని.. ఇప్పుడు బలం తగ్గడంతో ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వైసిపిని వ్యతిరేకించే వారితో పొత్తులుంటుందని చెప్పారు..? కబ్జాల నుంచి, దౌర్జన్యాల నుంచి, అరాచకాల నుంచి బయటకు రావాలని సిఎం ఎమ్మెల్యేలకు సూచించారన్నారు. వైసిపి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో జగన్ మాటలతోనే అర్థమవుతోంది.. మూడేళ్ళు రాష్ట్రాన్ని దోచేశామని సిఎం చెప్పకనే చెప్పారు..! అని చురకలు అంటించారు.