మొయినాబాద్ ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో బీజేపీ ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బండి సంజయ్ యాదాద్రిలో దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన తీరు ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే లాగా ఉందన్నారు. ఎవరైనా దొంగలు, హంతకులు కూడా దేవుని ఎదుట అబద్ధపు ప్రమాణం చేస్తే వారి నేరం మాసిపోతుందా? అని ప్రశ్నించారు.
మీకు చేతనైతే ఎంఎల్ఏల కొనుగోలుపై సుప్రీం కోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కూనంనేని సాంబశివరావు. వివిధ రాష్ట్రాలలో ఎంఎల్ఏలను కొనుగోలు చేసి ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూల్చిన బీజేపీ జాతీయ నేతలతో బండి సంజయ్ అదే విధంగా ప్రమాణం చేయించగలరా? అని సవాలు విసిరారు. మతమనేది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమని కూనంనేని సాంబశివరావు అన్నారు. దానిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.