కార్తీక మాస సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో మూడు చోట్ల దీపోత్సవా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలన భవనంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబరు 7న యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా ఆలయాల డిప్యూటీ ఈవో లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తగినంతమంది గాయకులను కార్తీక దీపోత్సవాలకు పంపడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్తీక మాసం విశిష్టత, భక్తులు చేయాల్సిన, చేయకూడని పనులు తెలిపే కరపత్రాలు ప్రెస్ ప్రత్యేకాధికారి సిద్ధం చేయాలని జేఈవో అన్నారు. స్టేజీ, బారికేడ్లు, ఇతర ఇంజినీర్ ఏర్పాట్ల పనులు ముందుగానే చేపట్టాలని చీఫ్ ఇంజినీర్‌కు సూచించారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముక్ కుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.