పని నేర్చుకోవడానికి వెళ్లిన ముగ్గురు మైనర్ బాలలపై ఘోరం 

పుణెలో ఘోరం చోటుచేసుకున్నది. ఖాళీ సమయంలో పని నేర్చుకోవడానికి వచ్చిన ముగ్గురు మైనర్ బాలలపై గ్యారేజ్ ఓనర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత ఏడాదిన్నర కాలంగా ఆ బాలలు గ్యారేజ్ సందర్శించినప్పుడుల్లా ఎవరో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడుతూ ఉన్నాడు. ఎట్టకేలకు తండ్రికి విషయం చెప్పడంతో ఆ దుర్మార్గుడి బండారం బయట పడింది.

పుణెలోని కొత్తుర్డ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గ్యారేజ్ ఓనర్ వినాయక్ వాఘ్(45)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. బాధితులు 12 ఏండ్లు, 10ఏండ్లు, 8 ఏండ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గత కొంత కాలంగా స్కూళ్లు తెరుచుకోలేదు. పిల్లలు ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. వినాయక్ వాఘ్ గ్యారేజ్‌లో పిల్లలకు పని నేర్పించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుని అతన్ని సంప్రదించారు. అతను అంగీకరించడంతో పిల్లలను పనికి పంపించడం ప్రారంభించారు. ఆ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అన్నదమ్ములు కాగా మరొకరు బంధువు. గత ఏడాదిన్నర కాలంగా గ్యారేజ్‌కు వెళ్లినప్పుడు ఎవరో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడేవాడని బాధిత పిల్లలు పోలీసులకు తెలిపారు. గురువారం కూడా అఘాయిత్యానికి పాల్పడటంతో విషయం తండ్రికి చెప్పాలని ఆ మైనర్ బాలలు నిర్ణయించుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.