గుజరాత్‌లోని సూరత్ కోర్టులో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు విధించడంతో తీవ్ర నిరాశకు గురైన 27ఏండ్ల ముద్దాయి జడ్జిపైకి చెప్పు విసిరాడు.
గత ఏప్రిల్‌లో చాక్లెట్లు ఇప్పిస్తానని ఆశ చూపి నాలుగేండ్ల చిన్నారిపై సుజిత్(27) అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్(పోస్కో) కింది కేసు నమోదు చేశారు. నాలుగేండ్ల చిన్నారి తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు.
న్యాయవాది వినయ్ శర్మ వివరాల ప్రకారం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే జడ్జిపైకి సుజిత్ చెప్పు విసిరాడు. జీవిత ఖైదు విధించడంపై ముద్దాయి తీవ్ర నిరాశకు గురయ్యాడని, తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించాడు.
ప్రాసిక్యూషన్‌లో భాగంగా 29 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది.