హైదరాబాద్ లో రౌడీ షీటర్ పై కత్తులతో దాడి చేసిన మరో గ్యాంగ్

హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్ పై మరో గ్యాంగ్ హత్యాయత్నానికి పాల్పడింది. ఉదయం ఐదు గంటలకు ఆరంగర్ చౌరస్తాలో తన పాన్ షాప్ తెరిచాడు ఖాజా పాషా. షాప్ తెరిచిన కొద్దిసేపటికే ఖాజా పై దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వచ్చి ఖాజా పాషా పై కత్తులతో దాడి చేశారు. చిన్న అలియాస్ మోసిన్ గ్యాంగ్ ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. గాయాల పాలైన రౌడీ షీటర్ ఖాజాపాషను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఖాజా పాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు వచ్చి తనపై దాడి చేశారని.. వారిపై దాడి చేయడానికి తిరిగి ప్రయత్నించాను అని తెలిపాడు. కానీ ఆరుగురు ఒకేసారి దాడి చేయడంతో వారి నుండి తప్పించుకోవడానికి రాజేంద్రనగర్ వైపు పరుగులు తీశానని తెలిపాడు. 294 పిల్లర్ వరకు తనని వెంబడించారని.. ఆ తర్వాత పారిపోయారని తెలిపాడు. వారిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపాడు ఖాజా పాషా. పోలీసులే తనని హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపాడు.