మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో స్కూల్ బస్సు డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్సులో ఉన్న మహిళా అటెండర్ సాయంతో బ్యాగ్‌లోని దుస్తులను తీసి చిన్నారి డ్రెస్‌ను మార్చేశాడు. అనంతరం పాపను ఇంటి వద్ద దింపేశాడు.
పాప ఒంటిపై వేరే దుస్తులు ఉన్న విషయాన్ని గమనించిన చిన్నారి తల్లి.. స్కూల్ యాజమాన్యాన్ని ఆరా తీసింది. వారు ఆ పని మేము చేయలేదని వివరణ ఇచ్చారు. అనంతరం, చిన్నారి తన ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు చిన్నారిని దగ్గరికి తీసుకొని ఏం జరిగిందో చెప్పాలని అడిగారు. దీంతో చిన్నారి అసలు విషయం చెప్పింది. బస్సు డ్రైవర్ తనతో చెడుగా ప్రవర్తించాడని, దుస్తులు కూడా అతడే మార్చాడని తెలిపింది.
ఈ ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మహిళా అటెండర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.