గుజరాత్‌ వంతెన ప్రమాదంలో 100 దాటిన మృతుల సంఖ్య

-

గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 100 దాటిందని ఆ రాష్ట్ర సమాచార శాఖ వెల్లడించింది. సహాయక సిబ్బంది 177 మందిని సురక్షితంగా కాపాడినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్, ఎన్​డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో భాగమయ్యాయని పేర్కొంది.

మోర్బీ నగరంలోని మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు సమాచారం. బ్రిడ్జిపై ఉన్న కొంతమంది యువకులు ఉద్దేశపూర్వకంగా వంతెనను ఊపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వంతెన కూలడం వల్ల చాలామంది నీటిలో పడి గల్లంతయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉండగా… వందల మంది గాయపడ్డారు.

సందర్శకులు నదిలో పడిపోగానే ఈతరాని వారు మునిగిపోగా.. చాలామంది రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. ఒకరిపై ఒకరు పడడం వల్ల కొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. తీగలను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. నీళ్లలో మునిగిపోతున్నవారిని రక్షించేందుకు మరి కొంతమంది ప్రయత్నించారు. వంతెన కూలిన ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైనవారి కోసం పడవల సాయంతో గాలింపు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news