తెలంగాణలో విజయారెడ్డి హత్యోదంతం తరువాత, చాలా ప్రాంతాల్లో రెవెన్యూ ఉద్యోగులకు బెదిరింపులు పెరిగిపోయాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మం డలం దూకలపాడులో బుధవారం వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకొచ్చిన అల్లు జగన్‌మోహనరావు అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తన పొలంలో మురికి కాలువ తవ్వించారని, ప్రభుత్వ సాయం అందకుండా చేస్తున్నారని, లంచం అడుగుతున్నారని దూషించాడు. ఈ క్రమంలోనే ఆ రైతు ముందుగానే బ్యాగులో ఉంచుకున్న పెట్రోల్ బాటిల్ ను బయటకు తీసి మహిళ పంచాయతీ కార్యదర్శిని చంపేసి తానూ చచ్చిపోతానని బెదిరించాడు.
దీంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. ఆ వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ అక్కడున్న అధికారులు, ఇతరులపైనా పడింది. ఈలోగా అతను అగ్గిపెట్టెను తీయడంతో, మరింత ఆందోళనకు గురైన సదరు మహిళా అధికారిణితో పాటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పరుగులు తీశారు. జరిగిన ఘటనపై పంచాయతీ కార్యదర్శి సుమలత, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, రైతును అదుపులోకి తీసుకున్నారు.