ముంబయిలో భారీగా ‘మ్యావ్​ మ్యావ్’​ డ్రగ్స్​​ స్వాధీనం

మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ). 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ముంబయి గౌడౌన్​లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.. 50 కేజీల మెఫెడ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

మరోవైపు.. ముంబయి విమానాశ్రయంలో 16 కేజీల హెరాయిన్​ పట్టుబడింది. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు.. మలావి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మలావి నుంచి ఖతర్​ మీదుగా ముంబయి వస్తున్న ఓ ప్రయాణికుడు అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నాడన్న సమాచారంతో డెరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్​పోర్టులో ఓ అనుమానితుడిని పట్టుకుని తనిఖీ చేయగా అతడి ట్రాలీ బ్యాగ్​లో 16 కేజీల హెరాయిన్ దొరికింది. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఘనాకు చెందిన మరో మహిళను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.