ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో భారీ చోరీ.. రూ.70 లక్షలు విలువ చేసే మొబైల్స్ మాయం

-

హైదరాబాద్ ఈసీఐఎల్‌ చౌరస్తాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో భారీ చోరీ జరిగింది. వెంటిలేటర్ ఊచలు తొలగించి షోరూంలోకి చొరబడ్డ దొంగలు రూ.70లక్షలకు పైగా విలువైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ షోరూం కుషాయిగూడ ఠాణాకు 100 అడుగుల దూరంలో ఉండడం గమనార్హం. చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు భావిస్తున్నారు. తలకు రుమాలు కట్టుకుని చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ పుటేజీల్లో నమోదయ్యాయి.

బుధవారం అర్ధరాత్రి 2.30 గంటలకు చోరీ జరిగింది. షోరూంకు, ఎడమ వైపు భవనానికి మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది. ఇక్కడే షోరూం మూలన వెంటిలేటర్‌కు ఉన్న ఇనుప కడ్డీలు, ఫాల్‌ సీలింగ్‌ను తొలగించి దొంగ భవనంలోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లాక అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లు తెంపేశాడు. 200కు పైగా ఐఫోన్‌, వివో, ఒప్పో, వన్‌ప్లస్‌ చరవాణులు తీసుకుని.. వాటి డబ్బాలు అక్కడే వదిలేసి పారిపోయాడు. వీటి విలువ సుమారు రూ.70లక్షలపైనే ఉంటుందని షోరూం యజమాని తెలిపారు. ఇతర లాప్‌లాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని ముట్టుకోలేదని చెప్పారు.

షోరూం తెరిచిన తర్వాత చోరీ విషయం గమనించిన సంస్థ జనరల్‌ మేనేజర్‌ మహ్మద్‌ హబీబ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలు సేకరించారు. లోపల ఉన్న సీసీ ఫుటేజీల్లో ఒక్కరు మాత్రమే కనిపించాడు. అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news