జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌లో నిన్న అర్థరాత్రి భారత ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ క్రమంలో చనిపోయిన వారిలో పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకడైన మహద్ భాయ్ ఉన్నట్లు భారత సైన్యం తెలిపింది.
పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆ దాడి సూత్రధారుల్లో ఒకడైన ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహద్ భాయ్‌ను భారత సైన్యం హతమార్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్‌లో నిన్న అర్థరాత్రి భారత ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ క్రమంలో చనిపోయిన వారిలో పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకడైన మహద్ భాయ్ ఉన్నట్లు భారత సైన్యం తెలిపింది.
కాగా మహద్ భాయ్ కాకుండా చనిపోయిన మిగిలిన ఇద్దరు తీవ్రవాదులు ఎవరా.. అని ఇప్పుడు భారత ఆర్మీ ఆరా తీస్తోంది. ఆ మేరకు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. త్రాల్ సమీపంలోని పింగ్లష్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని తెలుసుకున్న భారత ఆర్మీ నిన్న అర్థరాత్రి ఆ ప్రదేశానికి చేరుకుని సోదాలు చేపట్టింది. అయితే భారత సైనికుల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు కూడా దీటుగా ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు సుమారుగా 8 గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు.
భారత ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది మహద్ భాయ్ స్వస్థలం పుల్వామాయేనని తెలిసింది. పుల్వామా జిల్లాలోని త్రాల్ పట్టణంలో ఉన్న మిర్ మొహల్లాలో మహద్ పుట్టి పెరిగాడు. డిగ్రీ అభ్యసించాక ఏడాది పాటు ఎలక్ట్రిషియన్ డిప్లొమాను చదివాడు. కాగా ఇతనే పుల్వామా ఆత్మాహుతి దాడికి వాహనం, పేలుడు పదార్థాలను అమర్చినట్లు ఆర్మీ గుర్తించింది. కాగా మహద్ 2017లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరగా, అతను తరచూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసేవాడు. ఆ తరువాత నూర్ మహ్మద్ తాంత్రే అనుచరుడిగా పనిచేసి, 2018 జనవరి 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత మళ్లీ తాజాగా పుల్వామా ఘటనకు సూత్రధారుల్లో ఒకడు అయ్యాడు.
కాగా పుల్వామాలో దాడి చేసిన మానవబాంబు ఆదిల్ అహ్మద్ దార్‌తో మహద్ తరచూ మాట్లాడేవాడట. ఇక మహద్ 2018లో సుంజ్వాన్ ఆర్మీ స్థావరంపై దాడికి పాల్పడి 6 మంది జవాన్లను చంపాడని, ఆ తరువాత లేత్‌పోర్ సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలోనూ ఇతను కీలక సూత్రధారిగా ఉన్నాడని బారత ఆర్మీ వెల్లడించింది. ఇక పుల్వామా ఆత్మాహుతి దాడి కోసం వాడిన మారుతీ ఎకో మినీ వ్యాన్‌ను కూడా ఇతనే ఘటన జరిగేందుకు 10 రోజుల ముందు కొనుగోలు చేశాడని కూడా అధికారులు తెలిపారు.