నడుచుకుంటూ వెళ్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధిహామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ముగ్గురు మందాడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.