జొమాటో గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్. ఆన్ లైన్ క్షణాల్లో కావాల్సిన ఫుడ్ ను జొమాటో యాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలాగే బెంగళూరుకు చెందిన శరణ్ అనే వ్యక్తి అర్ధరాత్రి 2 గంటలకు చికెన్ బిర్యానీ బుక్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. వెంటనే డెలివరీ బాయ్ ఆర్డర్ ను తీసుకొని అడ్రస్ కు వెళ్లాడు. కస్టమర్ కు ఫోన్ చేశాడు.
2.30 కు కస్టమర్ అడ్రస్ కు వెళ్లిన డెలివరీ బాయ్.. ఆర్డర్ ను కస్టమర్ శరణ్ కు అందించాడు. ఫుడ్ ను తీసుకున్న కస్టమర్.. డెలివరీ బాయ్ కి డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోబోయాడు. దీంతో కస్టమర్ ను డెలివరీ బాయ్ అడ్డుకున్నాడు. ఆర్డర్ డబ్బులు 600 ఇవ్వలంటూ అడిగాడు. దీంతో… డబ్బులివ్వనని.. కావాలంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకో అంటూ దురుసుగా ప్రవర్తించాడు కస్టమర్. ఈక్రమంలో వాళ్లిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.
డబ్బులు ఇవ్వకున్నా.. కనీసం ఫుడ్ అయినా తిరిగి ఇచ్చేయాలని.. లేదంటే 600 రూపాయలు తనే కట్టాల్సి వస్తుందని ఫుడ్ డెలివరీ బాయ్ శరణ్ ను వేడుకున్నాడు. అయినా శరణ్ వినకుండా… డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. దీంతో డెలివరీ బాయ్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇంకా కోపోద్రికుడైన కస్టమర్… ఆ డెలివరీ బాయ్ పై రాయిని విసిరాడు. దీంతో తలకు రాయి తగిలి డెలివరీ బాయ్ కి గాయమైంది. తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఫుడ్ తో సహా అక్కడి నుంచి తుర్రుమన్నాడు కస్టమర్. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న మరో డెలివరీ బాయ్.. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని చూసి.. వెంటనే ఆసుపత్రికి తరలించాడు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆ డెలివరీ బాయ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.