సర్కార్ ఉద్యోగులకు కేంద్రం త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కరవు భత్యం(డీఏ)ను నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో 38 శాతంగా ఉన్న కరవు భత్యం 42 శాతానికి పెరగుతుంది. ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని జనవరి 1 నుంచే వర్తింపచేయనున్నట్లు సమాచారం. దీని ద్వారా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.
“2022 డిసెంబర్‌కు సంబంధించిన పరిశ్రమ కార్మికుల ద్రవ్యోల్బణ నివేదికను జనవరి 31న కార్మిక శాఖ విడుదల చేసింది. అందులో ఉన్న ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే 4.23 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం డెసిమల్ పాయింట్‌ను పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం” అని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గతేడాది సెప్టెంబర్‌లో నాలుగు శాతం పెంచడం వల్ల కరవు భత్యం 38 శాతానికి చేరింది. పెంచిన డీఏను 2022 జులై 1 నుంచి అమలు చేశారు.