కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంటలో దళిబంధు యూనిట్లను పరిశీలించారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగం అన్నారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈ పథకం ప్రవేశ పెట్టక ముందు వీళ్లంతా మరొకరి వద్ద ఉద్యోగాలు చేయవల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
ఈ పథకాలు పడ్బందీగా అమలు చేస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. చదువుతో పాటు ఉపాధి కల్పించే పథకాలు అమలు చేస్తేనే దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటి కౌంటర్ గ్యారంటీ అడగడమే ఇబ్బందులను తెచ్చిపెడుతుందన్నారు. గత 70 ఏళ్లుగా జీవన ప్రమాణాలు మెరుగు పడక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును స్వయంగా చూసానన్నారు ప్రకాష్ అంబేద్కర్.
ఇలాంటి పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నానన్నారు. 30% దారిద్ర్య రేఖ దిగువున ఉన్న మిగితా బలహీన కులాలను దళిత బంధు లో చేర్చాలని సీఎం కేసీఆర్ ను కోరుతానన్నారు. మిగితా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు.