గత కొన్ని రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. దీన్ని అన్నీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే క్రమంలో బిజేపిపై పోరాటం చేస్తున్న కేసిఆర్ సైతం..ఏపీలో ఎంట్రీ ఇవ్వడానికి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతామని ప్రకటించారు. అలాగే స్టీల్ ప్లాన్‌కు సంబంధించిన ఓ వేలంలో కూడా పాల్గొనాలని కేసిఆర్ డిసైడ్ అయ్యారు.
ఇదే క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది..దీంతో ఇది కేసీఆర్ విజయమని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పేస్తున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగడంతో కేంద్రం వెనుకడుగు వేసిందని అన్నారు. అయితే అంత తొందరగా ఎవరిపై ప్రశంసలు కురిపించని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తాజాగా కేసిఆర్ పై ప్రశంసలు కురిపించారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలినకు బృందాన్ని పంపి సరైన చర్యలు తీసుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటీకరణకు వెళ్లడానికి బదులుగా.. ఆర్ఐఎన్ఎల్‌ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నాం.” అంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గిందో క్లారిటీ లేదు..ఖచ్చితంగా కేసీఆర్ బిడ్డింగ్ పాల్గొనాలని అనుకోవడం వల్ల మాత్రం వెనక్కి తగ్గలేదనే చెప్పాలి. కానీ అది కేసీఆర్ వల్లే అని బిఆర్‌ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక లక్ష్మీనారాయణ కూడా అలాగే చెప్పడంతో..ఇక ఆయన కూడా బిఆర్‌ఎస్ లో చేరడానికి రెడీ అవుతున్నారని, అందుకే కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి జేడి పయనం ఎటు వైపో.