నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్, చైనాలో మరణమృదంగాన్నే సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటివరకూ 560 మంది వరకూ మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హుబే రాష్ట్రంలోనే 70 మంది వరకూ చనిపోయారని అధికారులు వెల్లడించారు. కొత్తగా 2,987 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 27,300 దాటింది.
పలు ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 1000 మందిని చికిత్స తరువాత డిశ్చార్జ్ చేసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే కరోనావైరస్ పై దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి క్లినికల్ ట్రయల్స్‌లో ఉంచడానికి యాంటీ వైరల్ డ్రగ్ ఓషధమైన రెమ్‌డెసివిర్ బ్యాచ్ త్వరలో చైనాకు చేరుకుంటుందని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలలో ఎబోలా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించినట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి.