వన్యప్రాణుల దాడుల్లో మరణాలు, పంట నష్టం పరిహారం పెంపు !

-

అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (Human- Animal Conflict) తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి.

అటవీశాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్ లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణం నిరోధించేందుకు అవసరమైన చర్యలను కూడా కమిటీ ఇవాళ చర్చించింది. వన్యప్రాణుల (పులులతో సహా) దాడుల్లో చనిపోయిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పరిహారం అధ్యయనం చేసిన తర్వాత బోర్డు ఈ కొత్త ప్రతిపాదనలు చర్చించింది.

ప్రస్తుతం ఐదు లక్షలు ఉన్న పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్ష రూపాయలకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షల రూపాయలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, యాభై వేల రూపాయలకు మించకుండా, అలాగే పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు ఆరువేలు ఉన్న పరిహారాన్ని ఏడువేలా ఐదు వందల రూపాయలకు పెంచాలని, పండ్లతోటలకు నష్టపరిహారం కూడా ఏడువేలా ఐదు వందల రూపాయలకు (గరిష్టంగా యాభై వేల రూపాయల దాకా) కమిటీ ప్రతిపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news