కరోనా వైరస్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై చాలా తీవ్రంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దినపత్రికల వల్ల ఆ వైరస్ వ్యాప్తి చెందవచ్చన్న వార్తల నేపథ్యంలో జనాలు న్యూస్ పేపర్లను తీసుకోవాలంటేనే జంకుతున్నారు. దీంతో 10 రోజుల పాటు వార్తాపత్రికలు బంద్ కావచ్చనే విషయాన్ని ‘మనలోకం’ ముందే తెలియజేసింది. అయితే ఇప్పుడదే విషయం నిజం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
కరోనా వైరస్ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రింటింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ వెల్లడించింది. కేవలం మంగళవారం మాత్రమే పత్రిక ప్రింట్ కానుంది. దీంతో రేపటి సంచిక మాత్రమే పాఠకులకు అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి ప్రింట్ మూతపడుతున్న నేపథ్యంలో ఇక ఆ పత్రిక పాఠకులకు అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని మంగళవారం ఆ పత్రిక స్వయంగా వెల్లడించింది. ఇక మిగిలిన పత్రికలు కూడా త్వరలో ఇదే బాటలో నడుస్తాయని జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దినపత్రికల యాజమాన్యాలు ప్రస్తుతం కొనసాగుతున్న నష్టాల దృష్ట్యా పత్రికలను మూసివేయవచ్చని ప్రచారం సాగుతోంది.
కాగా భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మార్చి 31వ తేదీ వరకు పరిస్థితిలో మార్పు రాకపోతే లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగించవచ్చని కూడా తెలిసింది.