కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కడిక్కడ వైరస్ ని కట్టడి చెయ్యాలని భావిస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో 36 కరోనా కేసులు నమోదు కాగా దేశ వ్యాప్తంగా మొత్తం 500 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణాలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోలేదు. దీనితో ఇప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటే వైరస్ ని కట్టడి చేయడం సాధ్యమని కెసిఆర్ భావిస్తున్నారు. వైరస్ ని కట్టడి చేయడానికి గాను… మరో నెల రోజుల పాటు తెలంగాణా లో లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం కెసిఆర్ కీలక అధికారులతో ప్రగతి భవన్ లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో ఆయన పలు ప్రతిపాదనలను అధికారుల ముందు పెట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పటి వరకు పూర్తిగా అన్ని బంద్ చెయ్యాలని ఎవరూ కూడా లాక్ డౌన్ ని ఉల్లంఘించకుండా ఉండేందుకు గాను మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటిస్తారు. దీనిపై ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చినట్టు కనపడుతుంది.