ఢిల్లీకి చెందిన బాబా కా ధాబా కాంత ప్రసాద్ గుర్తున్నాడా ? ఓ యూట్యూబర్ అతని ధాబా వీడియోను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున అతనికి విరాళాలు వచ్చాయి. దీంతో అతను అప్పులను తీర్చేసి ఓ రెస్టారెంట్‌ను కూడా ఓపెన్ చేశాడు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ అయింది. అయితే అతను ఇప్పుడు మళ్లీ కష్టాల్లో పడ్డాడు. అంతమంది సహాయం చేసినా అతని పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఢిల్లీలోని మాళవ్యనగర్ సమీపంలో బాబా కా ధాబా పేరిట ధాబా నడుపుతున్న కాంత ప్రసాద్ ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. అతను దుర్భర స్థితిలో జీవనం గడుపుతుండడంతో ఓ యూట్యూబర్ అతని వివరాలను వీడియో తీసి పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ అయింది. చాలా మంది అతనికి విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో కాంత ప్రసాద్ ఓ రెస్టారెంట్‌ను కూడా ఓపెన్ చేశాడు. పాత అప్పులు తీర్చేశాడు. తన కుమారులకు ఫోన్లను కొనిచ్చాడు. తమ ఇంటికి పైన ఓ ఫ్లోర్‌ను నిర్మించాడు. అయితే దురదృష్టం అతన్ని వెంటాడింది.
ఢిల్లీలో కోవిడ్ కారణంగా లాక్‌డౌన్‌ను చాలా రోజుల నుంచి అమలు చేస్తుండడంతో అతని రెస్టారెంట్ తీవ్రమైన నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో రెస్టారెంట్‌ను తీసేశాడు. తిరిగి ధాబాను నడిపించడం మొదలు పెట్టాడు. ఈ సందర్బంగా కాంత ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు రూ.5 లక్షలు ఖర్చయింది. ముగ్గురు పనివాళ్లను పెట్టుకున్నా. నెలకు రూ.1 లక్ష ఖర్చు వచ్చింది. కానీ రూ.40వేల బిజినెస్ మాత్రమే జరిగింది. మిగిలిందంతా చేతిలోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. పైగా లాక్ డౌన్ వల్ల ఆదాయం బాగా పడిపోయింది. అందుకనే రెస్టారెంట్‌ను తీసేశా.. అని అన్నాడు.
అయితే అంత భారీ మొత్తంలో విరాళాలు వచ్చినా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని, కనుక అతనికి ప్రభుత్వమే ఎంతో కొంత సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.