ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, కోవిడ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను వేధిస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు.
విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిని పోలీసులు అడ్డగించిన విషయాన్నీ చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. గతేడాది విశాఖలో ఎస్సీ వర్గానికి చెందిన వైద్యుడు సుధాకర్‌కు జరిగిన అన్యాయాన్ని మరువక ముందే అదే నగరంలో అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదని హితవు పలికారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసారు.