ఉత్తరాఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రవాసులకు వరాలు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. అలాగే ఢిల్లీ తరహాలో పాలనను అందిస్తామని, అసలు పవర్ కట్స్ లేకుండా చూస్తామని తెలిపారు.
తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో అధికార పార్టీ బీజేపీకి సీఎం అభ్యర్థి లేడని అన్నారు. బీజేపీ నాయకులు తమ సీఎంను తామే నిందిస్తారని, ప్రతిపక్ష పార్టీలకు నాయకులే లేరని అన్నారు. వారు ఢిల్లీకి తిరగడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఉత్తరాఖండ్ అభివృద్ధి గురించి ఆలోచించేవారు కరువయ్యారని అన్నారు.
కాగా అంతకు ముందు కేజ్రీవాల్ పంజాబ్‌లోనూ ఇలాగే అన్నారు. అక్కడ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. అయితే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో తాము ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను నెల నెలా అందిస్తున్నామని తెలిపారు. మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. పంజాబ్‌లో మహిళలు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా సంతోషంగా లేరని అన్నారు. కాగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 20 నుంచి 22 సీట్లలో పోటీ చేయనుందని తెలిసింది. అందులో భాగంగానే సీఎం కేజ్రీవాల్ ఆదివారం పైవిధంగా స్పందించారు.