తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి డీఓపీటీ వ్యవహరించిన తీరుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు గుత్తేదారులు చెల్లించారంటూ వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీకి రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీఓపీటీ పంపింది.
తాను చేసిన ఫిర్యాదుపై డీఓపీటీ నేరుగా చర్యలు తీసుకోకుండా రాష్ట్రానికి పంపడంపై గవినోళ్ల శ్రీనివాస్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్‌పై చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని డీఓపీటీకి నోటీసులు జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది.