దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు మూడు లక్షలపైన నమోదైన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ మహమ్మారి వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. అయితే ఈ కరోనా వల్ల అనేక మంది ఉపాది కోల్పోతున్నారు. ఇందులో భాగంగానే మొదటి దశలో లాక్ డౌన్ సందర్భంగా బాబా కా ధాబా యజమాని కాంత ప్రసాద్ ఓ యూ ట్యూబర్ కారణంగా అనూహ్యంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ బాబా కా ధాబా యజమాని కాంతా ప్రసాద్ తాజాగా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
81 ఏళ్ల వయసులో కూడా నిరంతరం కష్టపడుతున్న ఆయనకు తీరని కష్టాలు వేధించడంతోనే నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇటీవల పెట్టుకున్న రెస్టారెంట్ నష్టాల్లో మునిగిపోవడంతో.. వీరు మళ్లీ వారి పాత హోటల్లో వైపు మొగ్గారు. అయినా కరోనా వల్ల హోటల్ లో నష్టాలు వచ్చాయని.. ఆ నష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని తన తండ్రి కాంతా ప్రసాద్ ప్రయత్నించాడని కుమారుడు కరణ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కాంతా ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అని పోలీసులు పేర్కొన్నారు.